- హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులు
- వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ
- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సులో టికెట్లు కొట్టే కండక్టరమ్మ ఓ గర్భిణికి పురుడు పోసింది. తాను డ్యూటీ చేస్తున్న బస్సులో గర్భిణికి నొప్పులు రాగా, వెంటనే స్పందించి అదే బస్సులో ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముషీరాబాద్ డిపోకు చెందిన 1జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ఎక్కారు. బహదూర్‌పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.
నొప్పులు తీవ్రం కావడంతో గమనించిన బస్ కండక్టర్ ఆర్.సరోజ వెంటనే అప్రమత్తమైంది. మహిళా ప్రయాణికుల సాయంతో బస్సులోనే ఆ గర్భిణికి సాధారణ ప్రసవం చేసింది. శ్వేతారత్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా, ఇటీవల కరీంనగర్ బస్టాండ్‌లోనూ ఓ గర్భిణికి అక్కడి ఆర్టీసీ సిబ్బందే పురుడుపోశారు.
మంత్రి అభినందనలు..
బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ సరోజ, తోటి మహిళా ప్రయాణికులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. గర్భిణికి పురుడు పోసి మహిళా కండక్టర్ సరోజ మానవత్వం చాటుకున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆమెకు, తోటి మహిళా ప్రయాణికులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని చాటుతుండడం అభినందనీయమని సజ్జనార్ పేర్కొన్నారు.