హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల18వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందింది. ఈ కేసులో నిందితుడు రాజసింహరెడ్డిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అసలేం జరిగింది..?
ఈనెల 18వ తేదీన సయ్యద్ సైఫుద్దీన్ అనే వ్యక్తి, తన భార్య మరియా మీర్ తో కలిసి.. ఎర్రగడ్డ నుంచి గచ్చిబౌలికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మరో ద్విచక్రవాహనంపై వారి వెంటే మరో ఇద్దరు బంధువులు కూడా వెళ్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వద్దకు రాగానే ఈ యువకుల పక్క నుంచి ఓ బెంజ్ కారు వెళ్లింది. దీంతో రోడ్డుపై ఉన్న మురుగునీరు సయ్యద్ సైఫుద్దీన్ బంధువులపై పడడంతో కారులో ఉన్న రాజసింహరెడ్డిని దూషించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బైక్ పై వెళ్తున్న వారిని రాజసింహరెడ్డి ఢీకొట్టాడు. ఇది చూసి ఎందుకు ఢీ కొట్టావు..? అని రాజసింహరెడ్డితో సైఫుద్దీన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో సైఫుద్దీన్ దంపతులను కూడా రాజసింహరెడ్డి కారుతో ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి ఎగిరి కింద పడిపోయారు.
ఈ ఘటనలో మారియామీర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. 18వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సైఫుద్దీన్ భార్య మారియామీర్ మృతిచెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రాజసింహరెడ్డిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.