- టీఆర్ఎస్ నేతలపై కామ్రేడ్ల కామెంట్స్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలోని ఓ ఇంట్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్తుండగా, ఓ లెఫ్ట్ లీడర్ లేచి 'మేము టీఆర్ఎస్అభ్యర్థి గెలుపు కోసం కష్టపడుతున్నం. కిందిస్థాయికి వెళ్తున్నం. కానీ మీ వాళ్లే తిరుగతలేరు. పైపైన ఏదో తిరిగినట్టు చేస్తున్నరు. ఇట్లయితే కష్టం. మీకసలు మునుగోడులో గెలవాలని లేదా' అంటూ కామెంట్ చేశారు.
జై కేసారంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో ఓ మహిళ వీధిలో ఓ టీఆర్ఎస్ లీడర్‌తో పంచాయితీకి దిగారు. 'మా కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు. టీఆర్ఎస్కు ఓటేయమని మా పార్టీ వాళ్లు చెప్పిన్రు. మా ఇంట్లో ఆరు ఓట్లున్నయి. అయినా టీఆర్ఎస్ వాళ్లు మమ్ములను పట్టించుకుంటలేరు. మా ఇంటిని దాటి వేరే వాళ్లను కలుస్తున్నరు.' అంటూ గొడవ చేశారు. ఈ రెండు సంఘటనల టైంలో అక్కడున్న ఇరుపార్టీల నేతలు ముక్కున వేలేసుకున్నారు.