తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను హత్య చేయించిన అక్క

తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను హత్య చేయించిన అక్క
  • రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి మర్డర్‌ ప్లాన్‌
  • కురిక్యాలలో వివాహిత హత్య కేసులో ఐదుగురు అరెస్ట్‌

చొప్పదండి, వెలుగు : కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ఎస్సారెస్పీ కెనాల్‌ సమీపంలో జనవరి 27న వెలుగుచూసిన మహిళ మర్డర్‌ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో అతడి అక్క, ఆమె ప్రియుడితో పాటు మరో ముగ్గురు కలిసి సుపారీ ఇచ్చి మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం చొప్పదండి సీఐ ప్రకాశ్‌గౌడ్‌ వెల్లడించారు. 

మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన మేడ మమత (24)కు తన భర్తతో మనస్పర్ధలు రావడంతో నాలుగేండ్ల కుమారుడితో మంచిర్యాలకు వచ్చి తిలక్‌నగర్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో మమతకు రామకృష్ణాపూర్‌ ప్రాంతానికి చెందిన కులుమల్ల భాస్కర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భాస్కర్‌ కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో మమతను హత్య చేస్తేనే భాస్కర్‌ మారుతాడని భావించిన అతడి అక్క నర్మద తన ప్రియుడు రఘు, తండ్రి రాయలింగు, బావ వెంకటేశ్‌తో కలిసి ప్లాన్‌ చేసింది. 

ఇందులో భాగంగా లక్సెట్టిపేటకు చెందిన వేల్పుల కల్యాణ్‌తో రూ. 5 లక్షలకు అగ్రిమెంట్‌ కుదుర్చుకొని మొదట రూ. 60 వేలు ఇచ్చారు. కల్యాణ్‌ మమతతో పరిచయం చేసుకొని, డబ్బులు ఇస్తూ దగ్గరయ్యాడు. జనవరి 25న కారు కిరాయికి తీసుకొని మమతను, ఆమె కొడుకును ఎక్కించుకొని సాయంత్రం ఆరు గంటల వరకు మంచిర్యాలలో తిప్పాడు. ఈ క్రమంలో కారులోనే మమత మెడపై కత్తితో పొడిచి, తాడుతో బిగించి హత్య చేశాడు. తర్వాత నర్మద, ఆమె కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మమత డెడ్‌బాడీని చూపించి, రూ. 4 లక్షలు తీసుకున్నాడు. 

అనంతరం అదే కారులో లక్సెట్టిపేట, ధర్మపురి, జగిత్యాల మీదుగా రాత్రి 11.30 గంటలకు గంగాధర మండలం కురిక్యాల శివారుకు చేరుకొని అక్కడ మమత డెడ్‌బాడీని పడేశాడు. తర్వాత బాబును తీసుకొని చెన్నై పారిపోయాడు. మొదట గుర్తుతెలియని మహిళగా భావించిన పోలీసులు ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో మృతురాలి అక్క చౌదర ఉమాదేవి వచ్చి చనిపోయింది తన చెల్లెలు మమతగా గుర్తించింది. దీంతో పోలీసులు మంచిర్యాలలో సీసీ కెమెరాలను పరిశీలించారు. 

కల్యాణ్‌ హత్య చేసినట్లుగా నిర్ధారించి, అతడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం చెన్నై వెళ్లి ఓ హోటల్‌లో ఉన్న కల్యాణ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు బాబును వదిలి పరారయ్యాడు. దీంతో చిన్నారిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

బుధవారం గంగాధర మండలం వెంకటాయపల్లి స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు కల్యాణ్‌ కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత హత్యకు పథకం రూపొందించిన నర్మద, రాజలింగు, గుంపుల రఘు, బండ వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకున్న ఎస్సై నరేందర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు జంపయ్య, శ్రీధర్‌, ప్రదీప్, మహేందర్‌ను సీఐ అభినందించారు.