కరీంనగర్జిల్లాలో వినాయక నిమజ్జన వేడులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ వినాయకుడి ఉత్సవాల్లో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. డప్పు చప్పుళ్లతో హుషారుగా నృత్యాలు చేస్తూ..బై బై గణేషా అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. కానీ నిమజ్జనానికి వచ్చిన ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వచ్చింది. కానీ నిమజ్జనం చేసేందుకు మాత్రం ఆమె ముందుకు రావడం లేదు. ఆమెతో వచ్చిన వారు తన చేతిలో ఉన్న బొజ్జ గణపయ్యను నీటిలో నిమజ్జనం చేయాలని సూచించారు. ఇక అంతే ఆమె ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యింది. అసలు ఏం జరిగిందని అక్కడున్నవారందరూ వాకబు చేయగా తాను ఎంతో ఇష్టంగా బావించి పూజలు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో అందరూ సముదాయించడంతో నిమజ్జనం చేసేందుకు ముందుకు వచ్చింది.
తొమ్మిది రోజుల పూజల అందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఎందుకో ఆమె మనస్సు అంగీకరించలేదు. బంధువులు,స్నేహితులు ఎంత సముదాయించినా కంట కన్నీరు ఆగలేదు. గణేశుడిని గుండెకు హత్తుకుని బోరున విలపించింది. ఎంతో ప్రేమగా పూజించిన గణనాథుడికి వీడ్కోలు చెప్పేందుకు సదరు మహిళ ఇష్టపడలేదు. గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి ఒప్పుకోలేదు. ఎంతో భక్తి భావంతో పూజలు అందుకున్న గణనాథుడు.. తనకు దూరమౌతున్నాడనే బాధను తట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన హుజురాబాద్ లో జరిగింది.