ఫేస్ బుక్​లో పరిచయం.. పెండ్లి పేరుతో యువతిపై అత్యాచారం

ఫేస్ బుక్​లో పరిచయం.. పెండ్లి పేరుతో యువతిపై అత్యాచారం
  •      ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నం
  •     శంషాబాద్​ ఎయిర్​పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •      బాధితురాలు ఛత్తీస్​గఢ్​కు చెందిన యువతి
సికింద్రాబాద్, వెలుగు: ఫేస్ బుక్​లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసి, విదేశాలకు పారిపోయేందుకు రెడీ అయిన యువకుడిని సికింద్రాబాద్​మహంకాళి పోలీసులు అరెస్ట్​చేశారు. ఇన్​స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా గంగాపూర్​గ్రామానికి చెందిన బండారం స్వామి(29) ఆస్ట్రేలియాలోని పౌల్ట్రీ కంపెనీలో జాబ్​చేస్తున్నాడు. ఇతనికి ఫేస్​బుక్​లో ఛత్తీస్​గఢ్​రాజధాని రాయ్​పూర్ కు చెందిన యువతి(27) పరిచయమైంది. 
 
కొన్నాళ్లుగా ఆమెతో చాట్​చేస్తున్న స్వామి పెండ్లి చేసుకుందామని నమ్మబలికాడు.  తాను ఇండియాకు వస్తున్నానని, హైదరాబాద్​లో కలుద్దామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన యువతి ఈ నెల 3న సిటీకి చేరుకుంది. ఆమెను స్వామి మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ ఇంటర్నేషనల్ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ రెండు రోజులు స్టే చేశారు. ఆ టైంలో స్వామి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
అనంతరం తన సొంతూరికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పెండ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి స్వామి దాటవేస్తూ వచ్చాడు. త్వరలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న బాధితురాలు ఛత్తీస్​గఢ్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును సికింద్రాబాద్ మహంకాళి పోలీసులకు ట్రాన్స్​ఫర్​చేశారు. మంగళవారం ఆస్ట్రేలియా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న నిందితుడు స్వామిని మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు.