
ఖానాపూర్, వెలుగు: ప్రియుడు దక్కడేమోనని మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18), ఓ యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా కొద్దిరోజులు ఆగాలని సూచించారు. దీంతో ప్రియుడు దక్కడేమోనని తీవ్ర మనస్తాపం చెందిన స్వప్న బుధవారం పత్తి చేనులోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లగా వెంటనే కుటుంబసభ్యులు ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె అదేరోజు రాత్రి11 గంటలకు చనిపోయింది. కేసు నమోదు చేసి ఖానాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.