- ఆరుగురిని పెండ్లి చేస్కుని..ఏడోసారి దొరికిన కిలేడీ
- యూపీలోని బందా కేంద్రంగా రాకెట్
న్యూఢిల్లీ: ఓ మహిళ ఆరుగురిని పెండ్లాడి.. వారి వద్దనుంచి నగదు, నగలు దోచుకుని పరారైంది. కానీ, ఏడో అటెంప్ట్‌లో పోలీసులకు దొరికిపోయింది. ఆమెతోపాటు ఈ రాకెట్ నడుపుతున్న మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బందాకు చెందిన విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి, పూనమ్, సంజన గుప్తా ఓ ముఠాగా ఏర్పడ్డారు.
ఒంటరి పురుషులకు గాలం వేసి, పూనమ్ ను ఇచ్చి పెండ్లి జరిపించేవారు. పెండ్లి కుదిర్చినందుకు విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి డబ్బులు కూడా తీసుకునేవారు. పూనమ్‌కు తల్లిగా సంజన గుప్తా నటించేది. పెళ్లి అయ్యాక కాపురానికి వెళ్లిన పూనమ్.. సమయం చూసి ఇంట్లోని నగలు, నగదుతో పరారయ్యేది. ఇలా ఆరుగురిని పెండ్లి చేసుకొని మోసం చేసింది.
ఏడో అటెంప్ట్‌లో శంకర్ ఉపాధ్యాయ్ అనే ఒంటరి పురుషుడిని విమలేశ్ సంప్రదించాడు. కమిషన్ మాట్లాడుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. అయితే, వారి తీరును అనుమానించిన శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నలుగురినీ అరెస్ట్ చేశారు.