పుస్తెలు అమ్మి దళిత బంధు కోసం కమీషన్ ఇచ్చిన

దళితబంధు ఇప్పిస్తామన్న లీడర్ల మాటలు నమ్మి.. పుస్తెలు అమ్మి కమీషన్ ఇచ్చా అని, చివరికి తన పేరు లిస్ట్​లో రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో దళితబంధు, గృహలక్ష్మి పథకాల్లో అక్రమాలకు వ్యతిరేకంగా దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. తర్వాత దళితబంధు, గృహలక్ష్మి పథకంలో తన పేరు లేకపోవడంపై గడ్డంమీది రమ్య బీఆర్ఎస్ లీడర్లపై మండిపడింది. 

రూ.10వేల కమీషన్ ఇస్తే దళితబంధు ఇప్పిస్తామని లోకల్​గా ఉన్న బీఆర్ఎస్ నేతలు మాట ఇచ్చారని, దీంతో పుస్తెలు అమ్మి వాళ్లు అడిగిన డబ్బులు చేతిలో పెట్టానన్నారు. పసుపు కొమ్ము కట్టుకొని తిరుగుతున్నా.. లిస్ట్​లో తన పేరు రాలేదన్నారు. బీఆర్ఎస్ లీడర్లు తమ అనుచరులు, కార్యకర్తలకు మాత్రమే స్కీమ్​లు ఇస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం వచ్చే నేతలను చెప్పులతో కొడ్తామంటూ మహిళలు ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అవినీతిమయం అయ్యాయని మాదిగ యువసేన జిల్లా ఇన్​చార్జ్ కాడపాక శ్యాం విమర్శించారు. ధర్నాలో కాంగ్రెస్ లీడర్లు శ్రీనివాస్, అల్వాల అయిలయ్య, బోడ తులసమ్మ, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.