- చనిపోయిందనుకున్న మహిళ.. సీపీఆర్‌తో బతికింది
- అత్తింటి వేధింపులతో ఉరేసుకున్న బాధితురాలు
- చనిపోయిందని బాడీని బయటేసిన కుటుంబసభ్యులు
- కానిస్టేబుల్ వచ్చి సీపీఆర్ చేయడంతో నిలిచిన ప్రాణం
- నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘటన
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చనిపోయిందనుకున్న మహిళ.. సీపీఆర్ చేయడంతో బతికింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో జరిగింది. గద్వాల జిల్లాకు చెందిన కీర్తికి, నాగర్‌కర్నూల్‌కు చెందిన జగదీశ్ కు 12 ఏండ్ల కింద పెండ్లయింది. వీళ్లకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కీర్తి మామ జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేసేవారు. ఆయన ఏడేండ్ల కింద చనిపోగా, కారుణ్య నియామకాల్లో భాగంగా ఏడాది కింద జగదీశ్ కు జెడ్పీలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది.
పెద్ద కొడుకు ఉద్యోగంలో చేరడంతో ఇల్లును రెండో కొడుకైన వెంకటేశ్‌కు ఇవ్వాలని తల్లి పద్మ భావిస్తోంది. అయితే ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. జగదీశ్ మౌనంగా ఉండడంతో.. ఇంట్లోంచి వెళ్లిపోవాలని అత్త, మరిది కొంతకాలంగా కీర్తిని వేధిస్తున్నారు. దీనిపై నాలుగు నెలల కింద కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో కీర్తి సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఆ టైమ్ లో భర్త జగదీశ్ ఇంట్లో లేరు. కొద్ది సేపటికి గుర్తించిన అత్త, మరిది.. ఆమె చనిపోయిందని బాడీని తీసుకొచ్చి బయట వేశారు. కీర్తి చనిపోయిందని గద్వాలలో ఉండే ఆమె తల్లి, అన్న రఘుకు సమాచారం ఇచ్చారు. రఘు నాగర్‌కర్నూలులో పనిచేసే కానిస్టేబుల్ మల్లేశ్‌కు ఫోన్ లో విషయం చెప్పి, ఏం జరిగిందో కనుక్కోవాలని కోరారు.
మల్లేశ్ వచ్చి పరిశీలించి, చనిపోయి ఎంతసేపు అయిందని అత్తింటివాళ్లను అడిగారు. అర్ధగంట అయిందని చెప్పడంతో, వెంటనే సీపీఆర్ చేశారు. ఆమెలో కదలిక కనిపించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించడంతో కీర్తి ప్రాణం నిలిచింది. చనిపోయిన రెండు మూడు గంటల్లోగా సీపీఆర్ చేస్తే బతికే అవకాశం ఉంటుందని తమకు ట్రైనింగ్ లో చెప్పారని కానిస్టేబుల్ మల్లేశ్ తెలిపారు. కాగా, కీర్తి మెడ దగ్గర బోన్ ఫ్యాక్చర్ కావడంతో ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ కు తరలించారు.