డ్యూటీకి వెళుతూ లారీ కింద పడి కార్మికుడు మృతి

  •     మేనేజ్‌‌మెంట్‌‌  బాధ్యత వహించాలని కార్మికుల ధర్నా 
  •     డ్యూటీకి హాజరుకాని కార్మికులు
  •     జీడీకే 11వ గనికి లాకౌట్‌‌

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీడీకే 11వ గనికి చెందిన జనరల్‌‌ మజ్దూర్‌‌  కార్మికుడు కౌటం సంపత్‌  (56) ‌ బైక్‌ ‌పై మంగళవారం రాత్రి 11 గంటలకు డ్యూటీకి వెళుతుండగా అదుపు తప్పి లారీ కింద పడి చనిపోయాడు. ఫైవింక్లయిన్‌‌ రోడ్డులో బొగ్గులారీలో నుంచి పెద్దసైజులో ఉన్న బొగ్గు పెళ్ల ఆయన తలపై పడడంతో బైక్ అదుపు తప్పి సంపత్.. లారీ టైర్ల కింద పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనకు సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌దే బాధ్యత అంటూ బుధవారం గని గేటు ముందు కార్మిక సంఘాల లీడర్లు ఆందోళన చేపట్టారు. 

వారికి సంఘీభావంగా కార్మికులు కూడా  డ్యూటీకి హాజరు కాకుండా ధర్నాలో పాల్గొన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆధికారులు గనికి లాకౌట్‌‌ ప్రకటించారు. మొదటి షిప్టుతో పాటు రెండో షిప్టులో కూడా కార్మికుల ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల లీడర్లు మాట్లాడుతూ గతంలో ఫైవింక్లయిన్‌‌ చౌరస్తా నుంచి జీడీకే 11 ఇంక్లైన్‌‌ కు వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్ల దూరం  ఉండేదని, కానీ ఓపెన్‌‌ కాస్ట్‌‌  ఏర్పాటు వల్ల సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌ ఈ దారిని మూసివేసి జీడీకే రెండో  గని నుంచి సుందిళ్ల, ముస్త్యాల తదితర గ్రామాల మీదుగా 13 కిలోమీటర్ల దూరం రోడ్డు వేసిందని తెలిపారు. 

ఈ దారి గుండా నిత్యం బొగ్గులారీలు, హెవీ వెహికిల్స్‌‌  నడుస్తుండడంతో కార్మికులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించగా 22 మంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. గతంలో ఉన్న పాతదారిని పునరుద్ధరించాలని, ఆఫీసర్లు వచ్చి సమాధానం చెప్పాలని యూనియన్ల లీడర్లు, కార్మికులు డిమాండ్‌‌ చేశారు. కాగా ఆర్జీ 1 ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌‌  గని వద్దకు చేరుకుని ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని, డీజీఎంఎస్‌‌ పర్మిషన్‌‌  కోసం లెటర్‌‌ రాస్తానని హామీ ఇచ్చారు. పాత రోడ్డును ఉపయోగించడంపై 15 రోజుల్లోగా సర్వే చేయిస్తానని తెలిపారు.