కెమికల్​ ఇండస్ట్రీలో కార్మికుడు మృతి.. విధులు నిర్వహిస్తూ కుప్పకూలిండు

కెమికల్​ ఇండస్ట్రీలో కార్మికుడు మృతి.. విధులు నిర్వహిస్తూ కుప్పకూలిండు

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర పీఎస్​ పరిధిలోని బోర్పట్ల గ్రామ సమీపంలో ఉన్న ఎపిటోరియ (అరబిందో) కెమికల్​ ఇండస్ట్రీలో ఓ కార్మికుడు చనిపోయాడు. బోర్పట్ల గ్రామానికి చెందిన కొప్పు నర్సింలు (36) కొంత కాలంగా స్థానిక ఎపిటోరియ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం కంపెనీలో విధులు నిర్వహిస్తూ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సంగారెడ్డిలోని ఓ హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు కంపెనీ ముందు డెడ్​బాడీని ఉంచి ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే నర్సింలు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్  చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సుభాష్,  జిన్నారం సీఐ వేణు కుమార్  ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.