- యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ కూడా !
- గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూభారతి చట్టంపై సీఎస్ వర్క్‌షాప్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, తెలంగాణ భూ భారతి చట్టం 2025పై సెక్రటేరియెట్ లో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి సీఎస్శాంతికుమారి, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టాన్ని వివరించేందుకే వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్.. భూ భారతి చట్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ పరిపాలన క్రమబద్ధీకరణ, జవాబుదారీతనంతో కూడిన సమగ్ర భూసంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ విజన్ అని అన్నారు.
మొత్తం 19 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి.. 2024 జూలై 1న ముసాయిదా చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. వారి సూచనల తర్వాతే ఈ చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. భూ భారతికి యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్‌ను తయారు చేయడంతో పాటు అవసరమైన నిబంధనలను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఎనర్జీ ప్రిన్సిపల్సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ..పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే గ్రీన్ ఎనర్జీ పాలసీ ఉద్దేశమని చెప్పారు. సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వినియోగదారులకు స్వచ్ఛమైన, విశ్వసనీయమైన, సరసమైన విద్యుత్‌ను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ లు రామకృష్ణారావు, రవిగుప్తా, వికాస్‌రాజ్, ముఖ్య కార్యదర్శులు దానకిషోర్, రిజ్వీ, క్రిస్టినా జోంగ్తు, కార్యదర్శులు లోకేశ్ కుమార్, యోగితా రాణా, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరీశ్ అధికారులు పాల్గొన్నారు.