కేటీఆర్ వేసిన శిలాఫలకాలకు ఏడాది.. పనుల జాడేది?

  • గతేడాది ఏప్రిల్ 12న వరంగల్​లో మంత్రి పర్యటన
  • రూ.2,500 కోట్ల విలువైన పనులకు ఒకే రోజు 28 శంకుస్థాపనలు 
  • ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి... ఇప్పటికీ ఒక్క పనీ పూర్తి కాలే

వరంగల్‍, వెలుగు: గతేడాది ఏప్రిల్‍ 12న గ్రేటర్‍ వరంగల్ ఎన్నికల సైరన్‍ మోగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు మంత్రి కేటీఆర్‍ సిటీలో పర్యటించారు. 40 ప్రోగ్రాముల్లో పాల్గొని ఒకే రోజు రూ.2500 కోట్ల విలువైన 28 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పనులు కంప్లీట్ చేసి సిటీ రూపు రేఖలు మారుస్తామని హామీలు ఇచ్చారు. కేటీఆర్ వచ్చి నేటికి ఏడాది గడిచినా ఒక్క పనీ పూర్తి కాలే. 

టెండర్లు దశ కూడా దాటలె

కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినా.. ఇయ్యాల్టికి ఒక్క పని కూడా పూర్తి కాలె. కాజీపేట గవర్నమెంట్ స్కూల్ వెనుక రూ. 5.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన 197 డబుల్ బెడ్రూం పనులు టెండర్ దశ కూడా దాటలేదు. దూపకుంట వద్ద 600 మంది కోసం చేపట్టిన డబుల్‍ బెడ్ రూం ఇండ్ల పనులకు అతీగతి లేదు. పెన్షన్‍పుర, చింతగట్టు, వంగపహాడ్‍, హసన్‍పర్తిలో డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కట్టనేలేదు. లక్ష్మీనగర్​కూరగాయల మార్కెట్‍లో రూ.24 కోట్లతో, రాంనగర్‍ ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్‍ వద్ద రూ.4.5 కోట్లతో నిర్మిస్తామన్న ఇంటిగ్రేటేడ్‍ మార్కెట్‍ పనులు మొదలు కాలేదు. ఎల్‍బీ నగర్​లో  రూ.2.25 కోట్లతో నిర్మించే షాదీఖానా, హజ్‍ హౌస్‍ పనులు ముందుకు సాగట్లేదు. రూ.65 కోట్ల నిధులతో చేపట్టే భద్రకాళి బండ్‍ రెండో దశ వర్క్స్ ఇంకా మొదలు పెట్టట్లేదు. ఖిలా వరంగల్​లో వాకర్స్ కోసం అక్కడున్న స్థలాన్ని కొనుగోలు చేసి ఇస్తామన్న ల్యాండ్‍ ఇవ్వలేదు. అండర్‍ బ్రిడ్జి వద్ద రూ.12.47 కోట్ల స్మార్ట్ సిటీ డ్రైనేజీ పనులు, శివనగర్‍ వరద ముంపు ఆపేలా రూ.26 కోట్లతో చేపట్టిన సీఎం అష్యూరెన్స్ డ్రైన్‍ పనులు నిలిచిపోయాయి. కరీమాబాద్‍ బురుజు వద్ద రూ.22 కోట్లతో చేపట్టిన స్మార్ట్ రోడ్‍ పనులు, రంగశాయిపేట వద్ద రూ.30 కోట్లతో చేస్తామన్న రోడ్లు, ఇంటిగ్రేటేడ్‍ మార్కెట్‍ పనులకు పునాదులు కూడా పడలేదు. 

నియో రైల్‍ రాలే.. విమానం ఎగరలే

మంత్రి కేటీఆర్‍ తన పర్యటనలో భాగంగా త్వరలోనే వరంగల్‍ సిటీకి నియో రైల్‍ తీసుకొస్తామని, డీపీఆర్ పూర్తయిందని చెప్పారు. సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆకర్షించడానికి మామునూర్ ఎయిర్ పోర్ట్ తిరిగి ప్రారంభిస్తామని మాటిచ్చారు. ఈ రెండు హామీలు నెరవేరనే లేదు. 

మోడల్ జర్నలిస్టు కాలనీ మరిచిన్రు

వరంగల్‍ తూర్పు జర్నలిస్టుల కోసం రూ.10.60 కోట్లతో నిర్మిస్తున్న ఇండ్ల పనులకు కేటీఆర్ గతేడాది శిలాఫలకం వేశారు. కానీ ఆ ఇండ్ల నిర్మాణ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయి. వరంగల్ పశ్చిమ జర్నలిస్టుల కోసం స్థలం సేకరించి ఇండ్ల పనులు మొదలుపెడతామని హమీ ఇచ్చి ఏడాది గడిచినా పత్తా లేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించిన మంత్రులు ఆపై ముఖం చాటేశారు.