డబుల్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తరు?

చండ్రుగొండ, వెలుగు: మండలంలోని రేపల్లెవాడ జీపీ పరిధిలో గల సత్యనారాయణపురంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని బీజేపీ మండల అధ్యక్షుడు బోగి కృష్ణ ప్రశ్నించారు. శనివారం బీజేపీ మండల కమిటీ సభ్యులు ఇళ్ల​నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఏడాది అవుతున్నా ఇప్పటికీ పునాదులకే పరిమితమైందని ఆరోపించారు. 

పేదవాడి సొంతింటి కల నిజం చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి, వారి ఆశలు అడియాశలు చేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీఆర్​ఎస్​ కు గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో జ్యోతి, రాజేశ్, రాంపండు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.