
న్యూఢిల్లీ: ఇటీవల చిన్న చిన్న సమస్యలకు భయపడి కొందరు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ్యామిలీ, ఫైనాన్షియల్, ఇతర ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రాణం విలువ ఏంటో ప్రజలకు తెలియజేసే వైద్యులు కూడా ఇటీవల వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిత్యం దేశంలో ఎక్కడో చోట వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఓ యువ వైద్యుడు సూసైడ్ చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నవదీప్ సింగ్ నీట్ యూజీ పరీక్ష 2017లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసిన నవదీప్.. ప్రస్తుతం అదే కాలేజీలో రేడియాలజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఉన్న నవదీప్ సింగ్‌కు సోమవారం అతడి తండ్రి కాల్ చేయగా ఎంతకీ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. దీంతో ఆందోళనకు గురైన అతడి తండ్రి పక్కన ఉండే స్నేహితుడికి కాల్ చేశాడు. అతడి స్నేహితుడు వెళ్లి చూడగా రూమ్‌లో నవదీప్ సింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు.
ALSO READ | కోల్కతా ఘటనలో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై నార్కో పరీక్షలు..?
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. చదువు ఒత్తిడి వల్ల ఏమైనా ఆత్మహత్యకు పాల్పడ్డడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఎంతో కఠినమైన నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవదీప్ సింగ్.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. యువ వైద్యుల వరుస ఆత్మహత్యలతో దేశంలో అసలేం జరుగుతోంది.. డాక్టర్ల సూసైడ్లకు కారణమేంటి అన్న చర్చ నడుస్తోంది.