అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో నరికి చంపాడు ఓ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీయడంతో తనకేమీ తెలియదని, రాణి తన చెల్లిలాంటిదని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే విచక్షణ కోల్పోయిన రాజు.. గంజాయి మత్తులో రాణిని అతి దారుణంగా తలపై నరికాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు రాణిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది. విషయం తెలియగానే తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ దొరికిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తన కూతురుని చంపిన రాజును కఠినంగా శిక్షించాలని రాణి తల్లి వేడుకుంటోంది. కొంతమంది పోలీసులతో ఉన్న స్నేహాం వల్లే రాజు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నాడని స్థానికులు ఆరోపించారు. గతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ పై రాజు దాడి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు..వారి ఇంటి సమీపంలో ఓ వివాహితపైనా గొడ్డలితో దాడి చేశాడని చెబుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. భవిష్యత్తులోనూ రాజుతో తమకు ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.