- ఆడిస్తానని రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడి
- సిద్దిపేటలోని మైత్రివనంలో ఘటన
- యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో మూడేండ్ల పాపను తన రూంలో ఆడిస్తానని చెప్పి తీసుకువెళ్లిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈనెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట టౌన్‌లోని మైత్రీవనంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో నేపాల్ కు చెందిన ఓ వ్యక్తి వాచ్‌మన్‌గా పని చేస్తూ భార్య, మనవరాలితో కలిసి ఉంటున్నాడు. కాగా, ఈ నెల19న మధ్యాహ్నం అదే అపార్ట్మెంట్లో పెయింటింగ్ పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ కు చెందిన అజయ్ వాచ్మన్రూమ్ కు వచ్చాడు. తాను పాపను ఆడిస్తానని చెప్పి తన రూంలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప ఏడుపు విన్న వాచ్మెన్ రూమ్‌కు పరిగెత్తుకు వెళ్లగా అప్పటికే అజయ్ పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పాపను సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిని మంగళవారం రాత్రి పొన్నాల బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ట్రయల్
ఈ ఘటనపై సిద్దిపేట సీపీ బి.అనురాధ మాట్లాడుతూ.. త్వరగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి టెక్నికల్, ఫోరెన్సిక్ల్యాబ్ రిపోర్ట్స్ త్వరగా తెప్పిస్తామని, కేసులో త్వరగా చార్జిషీట్ వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్నిర్వహించి బాధితురాలికి త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.