
శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లిలో ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడు హల్ చల్ చేశాడు. తన ప్రేమను కాదన్నదని బిల్డింగ్ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21), హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన యువతి ఎల్ఎల్బీ చదువుతున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమకు యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో కొద్దిరోజులుగా అతడిని దూరం పెడుతోంది.
దీంతో మనస్తాపానికి గురైన సోను గురువారం ప్రియురాలి ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తుపై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. కత్తితో చేతిని కోసుకొని, ఫ్లోర్ క్లీనర్ తాగాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ పైడి నాయుడు తెలిపారు.