దళితబంధు కోసం .. వాటర్​ట్యాంకు ఎక్కిన యువకుడు

సుల్తానాబాద్, వెలుగు:  దళితబంధు స్కీం కింద తనను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశాడు. పట్టణానికి చెందిన ఆరేపల్లి కిరణ్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  బుధవారం పొద్దుపోయాక స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు.  దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.

 స్థానిక ఎస్సై అశోక్ రెడ్డి అక్కడికి చేరుకొని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ట్యాంక్ నుంచి దిగాలని కోరారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తానని కిరణ్ బదులిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు డి.రాజయ్య, కిషోర్, ముస్త్యాల రవీందర్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి ఫోన్ లో చెప్పారు. 

దీంతో  విజయరమణారావు, కిరణ్ కు ఫోన్ చేసి వెంటనే ట్యాంక్ దిగాలని,  దళిత బంధు కోసం అవసరమైతే ప్రభుత్వంతో పోరాడి సాధించుకుంటామని నచ్చజెప్పారు. దీంతో కిరణ్ వాటర్ ట్యాంకు దిగివచ్చాడు.