చదువు పూర్తయి రెండేళ్లయినా ఉద్యోగం రావట్లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బావెన్(28) రెండేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అప్పులు చేశాడు.
దీంతో అప్పులు భారమై, ఉద్యోగం రాక, ఆర్థిక భారంతో మనోవేదనకు గురై పురుగుల మందు తాగాడు. అనంతరం తన స్నేహితుడికి సమాచారం అందించాడు. అతను వచ్చి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బావెన్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.