- పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణాలు
- రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రిలో ఘటన
వేములవాడ రూరల్, వెలుగు: ఒక కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు. ఓ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈ విషయం పెద్దలకు చెప్పకపోవడంతో వారు ఆరు నెలల కింద వేరే అబ్బాయికిచ్చి పెండ్లి చేశారు. భర్త గల్ఫ్‌కు వెళ్లగా తాను ప్రేమించిన అబ్బాయినే పెండ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో తప్పని..వద్దని నచ్చజెప్పారు. వినిపించుకోని అమ్మాయి మూడు నెలల కింద ఆత్మహత్య చేసుకుంది. ఈమె సోదరుడు కూడా తాను ప్రేమించిన అమ్మాయినే పెండ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో పెద్దలు వద్దన్నారు. దీంతో ఈ అబ్బాయి కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
అంతా విషాదమే
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు. నవ్యకు ఆరు నెలల కింద చందుర్తి మండలం నర్సింగాపూర్ కు చెందిన యువకుడితో పెండ్లయ్యింది. అతడు గల్ఫ్‌కు వెళ్లడంతో నవ్య..తల్లిదండ్రుల దగ్గరే ఉండేది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేండ్ల నుంచి ప్రేమలో ఉంది. మూడు నెలల కింద తన ప్రేమ గురించి పేరెంట్స్‌కు చెప్పి..సదరు యువకుడితో పెండ్లి చేయాలని కోరింది. వారు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. కాగా, నవ్య ప్రేమించిన యువకుడి సోదరి, నవ్య సోదరుడైన ప్రశాంత్ ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
దీని గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ కూడా ఈనెల 5న పురుగుల మందు తాగాడు. అతడిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రశాంత్ డెడ్‌బాడీతో అతడు ప్రేమించిన యువతి ఇంటి ముందు ధర్నా చేశారు. ఎస్సై మారుతి సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు యువతి కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.