నార్కట్‌పల్లి, వెలుగు: రైలు కింద పడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కామసాని వేణుగోపాల్ రెడ్డి(30) స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ కమాన్ వద్ద రైల్వే ట్రాక్ పైకి శనివారం రాత్రి వెళ్లాడు. అక్కడి నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రైలు కింద పడి చనిపోతున్నట్టు తెలిపాడు.
వెంటనే ఫ్రెండ్స్ వెళ్లి చూసే సరికి అతడు చనిపోయి కనిపించాడు. గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. వేణుగోపాల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో బోర్ వెల్ పని చేస్తున్నాడు. మూడు నెలల కింద సొంతూరుకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మృతుడికి 20 రోజుల కింద ఓ యువతితో ఎంగేజ్ మెంట్‌ను కుటుంబ సభ్యులు నిర్వహించారు.