కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత కాలువలో దూకి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కౌటాల సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం బారెగూడెం గ్రామానికి చెందిన మురుమురే ఉమేశ్(25) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వెళ్లలేదు. సోమవారం మండలంలోని లంబడి గూడ సమీపంలో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు కాలువలో ఓ డెడ్‌బాడీ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో వెంటనే సీఐ సాదిక్ పాషా ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీని బయటకు తీసి ఫొటోను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో మృతుడు ఉమేశ్ గా గుర్తించారు. ఉమేశ్ కొంతకాలంగా మానసిక స్థితి బాగాలేక తిరుగుతున్నాడని, ఈ క్రమంలోనే కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.