జగిత్యాల జిల్లాలో దారుణం.. వేటకు అమర్చిన ఉచ్చులో పడి యువకుడి మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం.. వేటకు అమర్చిన ఉచ్చులో పడి యువకుడి మృతి

మెట్ పల్లి, వెలుగు: అడవి జంతువుల కోసం అమర్చిన కరెంట్ తీగల ఉచ్చులో పడి యువకుడు చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తెలిపిన ప్రకారం.. మెట్ పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి నవీన్ (32), చిన్న నర్సయ్య వరుసకు అన్నదమ్ములు. వీరు  అడవి జంతువుల వేటకు వెళ్దామని శనివారం సాయంత్రం నిర్ణయించుకున్నారు. అంతకుముందే గ్రామ శివారులోని మహాజన్ వెంకటేశ్వర్‎కు  చెందిన మామిడి తోటలో చిన్న నర్సయ్య అడవి పందుల కోసం కరెంట్ వైర్లతో ఫెన్సింగ్ అమర్చాడు. 

ఇది తెలియని నవీన్ అర్ధరాత్ని అటువైపు వెళ్లడంతో అతని కాలుకు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కొద్ది సేపటి తర్వాత చిననర్సయ్య వెళ్లి నవీన్ కోసం వెతుకుతుండగా కరెంట్ వైర్ల వద్ద చనిపోయి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నిరంజన్ రెడ్డి  వెళ్లి పంచనామా చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ తరలించారు. తన భర్త నవీన్ చనిపోవడానికి కారణమైన చిన్ననర్సయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య లత పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.