సికింద్రాబాద్, వెలుగు: రైలు నుంచి జారి పడి యువకుడు మృతిచెందాడు. సికింద్రాబాద్రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచకు చెందిన షేక్ మహమ్మద్ ఆసిఫ్(20) సిటీకి వచ్చి చైతన్యపురిలో ఉంటూ.. ఓమ్ని ఆస్పత్రిలో సూపర్వైజర్ గా చేస్తున్నాడు. అతడు ఫీవర్ తో బాధపడుతుండగా సొంతూరు తీసుకెళ్లేందుకు అతని తమ్ముడు వచ్చాడు.
ఇద్దరూ కలిసి బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. 3 నంబర్ ప్లాట్‌ఫామ్ మీద కాకతీయ ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సింది పోయి.. పొరపాటున 2 నంబర్ ప్లాట్ ఫామ్ పై చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. వేరే ట్రైన్ ఎక్కామని తెలుసుకుని మౌలాలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వెళ్తుండగా.. కిందకు దిగుతూ ఆసిఫ్ జారిపడడంతో తలకు, బాడీకి తీవ్ర గాయాలై స్పాట్లో మృతి చెందాడు. రైల్వే పోలీసులు డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.