అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన  కరెంటు తీగలు తగిలి యువకుడి మృతి

అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన  కరెంటు తీగలు తగిలి యువకుడి మృతి

 

  • అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన  కరెంటు తీగలు తగిలి యువకుడి మృతి
  • భూపాలపల్లి జిల్లా మల్హర్  మండలంలో ఘటన

మల్హర్, వెలుగు: అడవి పందుల బారి నుంచి తమ పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు ఏర్పాటు  చేసిన  కరెంటు తీగలు ఆ యువకుడి పాలిట మృత్యుపాశాలయ్యాయి. కరెంటు తీగలు తగిలి అతను చనిపోయాడు. జయశంకర్  భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పిట్టల రాహుల్ (22) గ్రామ శివారులోని పంట పొలాలల్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రాహుల్  మూడు రోజులుగా కనిపించడం లేదు. 

అతనిని వెతికే క్రమంలో బుధవారం ఉదయం ఎడ్లపల్లి శివారులోని ఒక పొలంలో డెడ్​బాడీ దొరికింది. అడవి పందుల నుంచి తమ పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి రాహుల్  చనిపోయినట్లు అతని మృతదేహంపై ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. కొయ్యూరు ఎస్సై నరేశ్  ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కరెంటు తీగలు తగిలి రాహుల్  చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేస్తూ కొయ్యూరు చౌరస్తాలో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.