- స్పందించిన స్థానిక పోలీసులు
- అక్కడి ఎంబసీ అధికారులతో చర్చలు
- జోక్యం చేసుకున్న భారత ఎంబసీ ఆఫీసర్లు
- తమ దగ్గరే సురక్షితంగా ఉన్నాడని స్పష్టీకరణ
మహబూబాబాద్అర్బన్, వెలుగు : ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మహబూబాబాద్జిల్లాకు చెందిన ఓ యువకుడిని కంబోడియాకు తీసుకువెళ్లి హింసించారు. దీంతో అతడు తన అన్నకు ఏడుస్తూ ఓ వీడియో పంపించాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ మన ఎంబసీ ఆఫీసర్లతో మాట్లాడగా వారు స్పందించి అతడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితుడి కథనం ప్రకారం...మానుకోట జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన మున్సిఫ్ ప్రకాశ్‌కు తల్లిదండ్రులు లేరు. దీంతో సోదరుడి సాయంతో బీటెక్ వరకూ చదివాడు.
విదేశాల్లో ఉద్యోగం కోసం మూడు నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు. వారు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మించారు. ఆస్ట్రేలియాకు అని చెప్పి బ్యాంకాక్‌కు..అక్కడి నుంచి కంబోడియా తీసుకువెళ్లారు. చెప్పిన పని ఒకటి.. చేయాల్సిన పని మరొకటి కావడంతో ప్రకాశ్ఒప్పుకోలేదు. దీంతో మూడు రోజులకు ఒకపూట తిండి పెట్టి..ఇంజక్షన్లు ఇచ్చి బెల్టుతో చావబాదారు. షాక్ ఇస్తూ నరకయాతన పెట్టారు. రెండు రోజుల క్రితం పోలీసులు సదరు మోసగాళ్ల డెన్‌పై దాడి చేసి ప్రకాశ్‌ను సైతం అరెస్ట్ చేశారు.
దీంతో తనను ఎలాగైనా కాపాడమంటూ ప్రకాశ్ ఓ వీడియో పంపించాడు. అందులో ‘విదేశాల్లో జాబ్ అంటే వచ్చిన. ఇట్లయితదనుకోలే...నాకు నా మీద నమ్మకం పోయిందన్నా..ఇక్కడ ఏమైతదో అర్థం కావట్లే..నా ప్రాణం పోతదని అనిపిస్తంది. నేను సచ్చిపోతే చెల్లెకు చెప్పకు అన్నా’ అంటూ ఏడుస్తూ మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఎస్పీ సుధీర్ఆర్ కేకన్, డీఎస్పీ తిరుపతయ్య ఆదేశాల మేరకు బయ్యారం సీఐ రవికుమార్ కంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడారు.
వారు అతడు క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో ఆ సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. ఇండియన్ ఎంబసీ లో పనిచేస్తున్న ఆందోజన్ అనే ఆఫీసర్‌తో మాట్లాడగా అతడు ప్రకాష్ తో టచ్‌లోకి వెళ్లాడు. తర్వాత ప్రకాశ్‌ను భారత దౌత్య కార్యాలయానికి తరలించారు. అతడిపై పెట్టిన కేసుల విషయం తేలిన తర్వాత ఇండియాకు పంపిస్తామని చెప్పారు.