తమ్ముడు, ప్రేయసితో సహా ఐదుగురిని సుత్తితో కొట్టి చంపిండు.. కొద్ది గంటల్లోనే ఐదు మర్డర్లు

తమ్ముడు, ప్రేయసితో సహా ఐదుగురిని సుత్తితో కొట్టి చంపిండు.. కొద్ది గంటల్లోనే ఐదు మర్డర్లు

తిరువనంతపురం: నానమ్మను, కన్నతల్లిని, తమ్ముడినీ వదల్లే.. ఒకరితర్వాత మరొకరిపై తీవ్రంగా దాడి చేశాడు. పెదనాన్న, పెద్దమ్మనూ హతమార్చాడు. ఆఖరుకి ప్రియురాలిని కూడా సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా చంపేశాడు. ఆపై ఎలుకల మందుతాగి పోలీస్ స్టేషన్‎కు వెళ్లి చేసిందంతా చెప్పాడు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సోమవారం సాయంత్రం కొద్దిగంటల వ్యవధిలోనే ఈ హత్యలు జరిగాయి. 

నానమ్మను హతమార్చి.. 

కొల్లాంలోని ఓ కాలేజీలో పీజీ చదువుతున్న అఫాన్.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అఫాన్ ముందుగా సుత్తి తీసుకుని బైక్​మీద పాంగోడ్‎లో ఉంటున్న నానమ్మ సల్మా బీవీ(88) ఇంటికి వెళ్లాడు. ఆమెను చంపేశాక చుల్లాలంలో తన పెదనాన్న లతీఫ్(69), పెద్దమ్మ షాహిదా(60) ఇంటికి వెళ్లాడు. పెద్దమ్మ కిచెన్‎లో టీ పెడుతుండగా డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉన్న పెదనాన్నపై అఫాన్ సుత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత పెద్దమ్మ షాహిదాపై సుత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడే కుప్పకూలింది.

బిర్యానీ తిన్నాక తమ్ముడు, ప్రేయసిపై అటాక్.. 

లతీఫ్, షాహిదాను చంపేశాక నిందితుడు అఫాన్ తన తమ్ముడు అఫ్సాన్(13)​ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. అంతకుముందే మండీ బిర్యానీ తెస్తానని చెప్పి తన ప్రేయసి ఫర్జానాను కూడా ఇంటికి పిలిపించుకున్నాడు. తమ్ముడు, ప్రేయసి ఇద్దరూ బిర్యానీ తిన్న తర్వాత కుర్చీలో కూర్చుని ఉన్న ఫర్జానా నుదిటిపై అఫాన్ సుత్తితో దాడి చేశాడు. 

ఆ వెంటనే తన తమ్ముడిపైనా విచక్షణ లేకుండా అఫాన్ దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అఫాన్ తన తల్లి షెమీ(55)పైనా అటాక్ చేశాడు. వీళ్లందరిపై దాడి చేశాక ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్‎కు వెళ్లాడు. మూడు ప్రదేశాలలో ఆరుగురిపై దాడి చేశానని, మీరెళ్లేలోగా వాళ్లంతా చనిపోతారని పోలీసులకు తెలియజేశాడు. అప్పటికే అస్వస్థతతో ఉన్న అఫాన్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఇది అత్యంత క్రూరమైన దాడి

అఫాన్ మాటలు విని షాకైన పోలీసులు నిందితుడు చెప్పిన చోట్లకు తమ సిబ్బందిని పంపించారు. అక్కడ రక్తపు మడుగుల్లో పడిఉన్న డెడ్​బాడీలను గమనించారు. కొన ఊపిరితో ఉన్న నిందితుడి తల్లిని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురి డెడ్​బాడీలను స్వాధీనం చేసుకున్నారు. తాము చూసిన అత్యంత క్రూరమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు చెప్పారు. హత్యలకు కారణం ఆర్థిక కష్టాలేనని నిందితుడు చెప్పాడని తెలిపారు. 

ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం లేదని, కోలుకున్నాక మర్డర్లకు కారణాలేంటో తెలుస్తాయన్నారు. అతడి తల్లి కండిషన్ మాత్రం సీరియస్‎గా ఉందన్నారు. దుబాయ్‎లో ఉండే నిందితుడి తండ్రి రహీమ్ వాంగ్మూలం తీసుకున్నాక కూడా అసలు విషయాలు బయటపడొచ్చని పోలీసులు వెల్లడించారు. నిందితుడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు అతడి బ్లడ్ శాంపిల్స్‏లో బయటపడిందన్నారు. కానీ, హత్యలకు  ముందు మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు.