యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్

ఆశ ఉండాలి. కానీ.. మరీ అత్యాశ ఉండకూడదు. ఒక్కొసారి మనిషి ప్రాణాన్ని తీసేస్తోంది అది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆన్ లైన్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డ ఓ యువకుడు.. చివరకు తాను మోసపోయానని గ్రహించి.. ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఆ యువకుడు భార్య పరిస్థితి ఏంటి ఇప్పుడు..? చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బును ఆన్ లైన్ లో ఇన్వెస్ట్ చేసిన యువకుడిని సైబర్ కంత్రీగాళ్లు మోసం చేసిన తీరుతో నేటి యువత అలర్ట్ గా ఉండాల్సిందే. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేసే వారికి ఇదో హెచ్చరిక. 

అసలేం జరిగింది..?

సంగారెడ్డిలో ఉంటున్న అరవింద్ (30) అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా లైఫ్ సాగిపోతోంది. ఇక్కడే విధి వెక్కిరించింది. తనకు టెలిగ్రామ్ లో వచ్చిన మెసేజ్ లింక్ ను ఓపెన్ చేసి చూస్తే.. ఆన్ లైన్ లో డబ్బుల ఇన్వెస్ట్ గురించి ఉంది. ఆన్ లైన్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో వస్తాయని ఆ లింక్ సారాంశం. ఇంకేముంది.. అరవింద్ కూడా డబ్బులకు ఆశపడ్డాడు. ముందుగా ఆన్ లైన్ లో కొన్ని డబ్బులను బెట్టింగ్ పెట్టాడు. ఇచ్చిన టాస్క్ ను సరైన టైమ్ లో పూర్తి చేశాడు. కొన్ని టాస్క్ లకు రూ.200 ఇన్వెస్ట్ చేస్తే.. సైబర్ నేరస్తులు రూ.250 పంపించారు.

సైబర్ కంత్రీగాళ్లు

ఇదేదో బాగుందనుకుని.. మరికొన్ని డబ్బులను ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకేముందు.. సైబర్ నేరస్తుల చేతికి అప్పటికే చిక్కిన అరవింద్.. మరింత ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలోనే అధిక డబ్బు ఆశతో దాదాపు రూ.12 లక్షల వరకు ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టాడు. సైబర్ నేరస్తులు ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేశాడు. అయితే.. ఇక్కడే ట్విస్ట్ ఉంది. అరవింద్ టాస్క్ పూర్తి చేశాడు. కానీ... సైబర్ నేరస్తులు సైలెంట్ అయ్యారు. వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పెన్స్ రాలేదు. 

మేలో చెల్లి పెళ్లి

వచ్చే నెల అంటే మే5వ తేదీన అరవింద్ చెల్లె పెళ్లి ఉంది. ఇంట్లో ఖర్చులకు ఇచ్చిన డబ్బులను అరవింద్ మొత్తం వాడుకున్నాడు. ఆ డబ్బులను ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టడంతో ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అప్పులు తీర్చలేక...చెల్లి పెళ్లికి వాడుకున్న డబ్బులు సర్దలేక.. చివరకు తనువు చాలించాలని డిసైడ్ అయ్యాడు. బుధవారం (ఏప్రిల్ 26వ తేదీ ) మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

అరవింద్ మృతితో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుని.. తనువు చాలించడంతో ఆయన భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయ్యి ఉండి.. అధిక డబ్బులకు ఆశపడి ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టి.. చివరకు ప్రాణం తీసుకున్నాడు.