
అమరావతి: విశాఖలోని మధురవాడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించడంతో యువతిని, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామానికి చెందిన నక్కా దీపిక (20) ప్రస్తుతం తల్లితో కలిసి విశాఖ మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో దీపికను వేధిస్తున్నాడు.
తనకు ఇష్టం లేదని దీపిక తిరస్కరించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. బుధవారం (ఏప్రిల్ 2) దీపిక ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన దీపిక తల్లి నవీన్‌ను అడ్డుకోబోయింది. దీంతో ఆమెపై కూడా కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడిన దీపిక తల్లి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందగా.. దీపిక తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించడంతో నవీన్ అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికులు వెంటనే కొసప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న దీపికను ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపిక కూడా మరణించింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది నవీన్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బూర్జలో నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.