యువకుడిని కొట్టి చంపిన్రు.. ప్రేమ వ్యవహారమే కారణం?

కోల్​బెల్ట్​,వెలుగు : మంచిర్యాల జిల్లా  కాసిపేట మండలం మామిడిగూడ గ్రామానికి చెందిన  లౌడియా సాగర్​(22)  అనే యువకుడిని గుర్తుతెలియని  వ్యక్తులు శుక్రవారం రాత్రి  మందమర్రిలో  హత్య చేశారు.  మందమర్రి సీఐ మహేందర్​రెడ్డి, ఎస్సై చంద్రకుమార్​,  కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...  కొద్దిరోజులుగా  సాగర్​ లారీ క్లీనర్​గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జీతం డబ్బుల కోసం మందమర్రిలోని లారీ ఓనర్​ వద్దకు  వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు.

అదే రోజు రాత్రి మందమర్రిలో గుర్తుతెలియని నలుగురు యువకులు సాగర్​తో  గొడవపడి  తీవ్రంగా కొట్టి  శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో   యాక్సిడెంట్​లో  గాయపడ్డాడని  మంచిర్యాల ప్రభుత్వ దవాఖానాలో  చేర్చి వెళ్లిపోయారు.  ఆ తర్వాత కొద్దిసేపటికే సాగర్​ చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు అతడి కుటుంబసభ్యులకు  తెలిపారు. శనివారం పొద్దున మృతుడి ​ కుటుంబసభ్యులు హాస్పిటల్​కు చేరుకొని  సాగర్​ను హత్య చేసిన నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ధర్నాకు దిగారు.  

పోలీసుల అదుపులో నిందితులు

సాగర్​ తండ్రి తారాచంద్​ ఇచ్చిన ఫిర్యాదుతో  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగర్​ కొద్దిరోజుల కిందటి వరకు మందమర్రి రైల్వే స్టేషన్​ రోడ్​ ప్రాంతంలోని వాటర్​ ప్లాంట్​లో పనిచేసి మానేశాడు.  ప్రస్తుతం ​ లారీపై క్లీనర్​గా పనిచేస్తున్నాడు. పనిచేసిన చోట ఒక యువతితో కొనసాగిన  ప్రేమ వ్యవహారం కారణంగానే శుక్రవారం రాత్రి  సాగర్​ను నిందితులు పట్టుకొని  తీవ్రంగా కొట్టి చంపి ఉంటారనే పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  నలుగురు యువకులను మందమర్రి పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.