- భార్యతో గొడవ కారణంగా 3 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్యాయత్నం
- అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు
- జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన
పాలకుర్తి, వెలుగు : పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని అడ్డుకోబోయిన ఎస్సై, కానిస్టేబుల్‌కు సైతం గాయాలు అయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పాలకుర్తి మండలం కొండాపురం మేకల తండాకు చెందిన లాకావత్ శ్రీనుకు ఇదే మండలంలోని నర్సింగాపురం తండాకు చెందిన రాధికతో ఎనిమిది నెలల కింద పెండ్లి అయింది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించారు.
గర్భవతి అయిన రాధిక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. హెల్త్ చెకప్ కోసం ఈ నెల 16న జనగామ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు వెళ్లిన రాధిక స్కానింగ్ రిపోర్టులు తీసుకురావాలని శ్రీనుకు చెప్పింది. హాస్పిటల్‌కు వెళ్లిన శ్రీను అక్కడే రాధికతో గొడవ పడి కొట్టాడు. దీంతో ఆమె 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత పాలకుర్తి స్టేషన్‌లో మాట్లాడుకోవాలని అక్కడికి పంపించారు. ఈ నెల 17న ఇరు కుటుంబాల పెద్దలు పాలకుర్తి పీఎస్‌కు రాగా ఎస్సై సాయి ప్రసన్నకుమార్ భార్యాభర్తలిద్దరినీ మందలించి పంపించారు. స్టేషన్ బయటకు వెళ్లిన తర్వాత రాధిక బంధువు
దుబ్బతండాకు చెందిన గుగులోతు హుస్సేన్, శ్రీను గొడవ పడ్డారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకోవడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీను, హుస్సేన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. వారిని పక్కన కూర్చోబెట్టి ఇతర కేసులు విచారిస్తుండగా శ్రీను బయటకు వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని స్టేషన్‌లోకి వచ్చి ఒంటిపై పోసుకున్నాడు. గమనించిన ఎస్సై, కానిస్టేబుల్ రవీందర్ కలిసి శ్రీనును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శ్రీను తన దగ్గరున్న లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు.
దీంతో శ్రీను, కానిస్టేబుల్ రవీందర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని జనగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా తాను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి పాలకుర్తి ఎస్సై సాయి ప్రసన్నకుమార్, సీఐ మహేందర్‌రెడ్డే కారణమని శ్రీను ఆరోపించారు. భార్యతో పంచాయితీ కారణంగా మూడు నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోలేదన్నారు. వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు.
స్టేషన్ ఎదుట బంధువుల ధర్నా
ఆత్మహత్యకు యత్నించిన శ్రీను బంధువులు, మేకల తండావాసులు పాలకుర్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్‌లో ఉన్న హుస్సేన్‌ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గేటును తోసుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఘటనకు కారణమైన ఎస్సై, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య పాలకుర్తికి వచ్చి బాధితులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఎలాంటి గొడవలు జరగకుండా దేవరుప్పుల, కొడకండ్ల ఎస్సైలు సృజన్‌కుమార్, రాజుతో పాటు అదనపు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.