హైదరాబాద్ : ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా చంపేశారు. వెంటాడి వేటాడి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కళ్లెదుటే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత యువతిని తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన దేవరకొండ హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారంకాలనీకి షిఫ్ట్ అయ్యింది. DJ ఆపరేటర్ గాపని చేస్తున్న హరీష్ .. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం ఆమెను తీసుకెళ్లి.. పెళ్లి చేసుకున్నాడు. యువతి తమ కుటుంబ సభ్యులను ఎదిరించి హరీష్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కొత్తకాపురం పెట్టి ఉంటున్నారు.
గత 10 రోజుల నుండి హరీష్ కోసం సూరారంలోని అన్ని కాలనీల్లోనూ యువతి కుటుంబ సభ్యులు వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. గత నెల 24వ తేదీన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 30 మంది హరీష్ ఇంటి వద్ద గొడవ చేసినట్లు సమాచారం. మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి వెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై దారుణంగా హత్య చేసి.. పారిపోయారు. హరీష్ ఫ్రెండ్ ద్వారా సమాచారం తెలుసుకున్న యువతి బంధువులు.. రెక్కీ నిర్వహించి చంపేశారు.