ఎన్నాళ్లు ఇంకా ఈ లోన్ యాప్ వేధింపులు. ఇంకెంతమంది బలికావాలి...? ఇప్పటికే చాలామంది లోన్ యాప్ వేధింపులకు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా మరో యువకుడు లోన్ యాప్ వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడాలో శివ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శివ సొంతూరు ఈస్ట్ గోదావరి జిల్లా. కొంతకాలంగా తల్లిదండ్రులతో కలిసి ఎల్లారెడ్డి గూడాలో నివాసం ఉంటున్నాడు. డబ్బులు అవసరం ఉండి ఈ మధ్యే పలు లోన్ యాప్స్ లో రుణాలు తీసుకున్నాడు.
సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. లోన్ యాప్ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికి వచ్చిన తర్వాత కుమారుడు ఉరి వేసుకుని కనిపించడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. శివ డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.