ఖమ్మం రూరల్, వెలుగు : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి అని షరతు పెట్టాడు. అబార్షన్ అయ్యాక సదరు యువకుడు ముఖం చాటేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లులో గురువారం వెలుగుచూసింది. కామంచికల్లు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత బొప్పి ప్రభాకర్ కుమారుడు సంజయ్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా కలిశాడు.
యువతి గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో విషయాన్ని సంజయ్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లి చేస్తామని, కానీ ఈ లోగా గర్భం తీయించుకోవాలని సూచించారు. ఆ మాటలు నమ్మిన యువతి వారు ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంది. అయితే యువతి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించగా విషయం మొత్తం చెప్పింది.
దీంతో సంజయ్‌తో తమ కూతురికి వివాహం చేయాలని ఆమె పేరెంట్స్ ప్రభాకర్‌ను కోరారు. అతడు ఒప్పుకోకపోగా, వారిపై దాడికి యత్నించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంజయ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు ప్రభాకర్, దేవమణి, సోదరుడు అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.