
ఓ యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించాడని బాలిక వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ బాలిక బంధువులు రోడ్డెక్కడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన ఓ మైనర్(17)ను గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించాడు జమలయ్య(27) అనే యువకుడు. జమలయ్యపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు వచ్చారు కుటంబ సభ్యులు, బంధువులు. స్థానిక ఎస్ఐ ఫిర్యాదును తీసుకోకపోవడంతో గ్రామస్తులు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
ALSO READ | సూర్యాపేట జిల్లా బీబీ గూడెం వద్ద ఘోర ప్రమాదం.. బస్సు- కారు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్
తమ ఫిర్యాదు తీసుకోవాలని బాలిక బంధువులు రోడ్డుపైకి ఎక్కి నిరసనకు దిగారు. ఎంతకీ ఎస్సై స్పందించకపోవడంతో పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కింది బాలిక. ఆత్మహత్య చేసుకోబోయిన మైనర్ బాలికను స్థానికులు కాపాడారు.
యువకుడికి అండగా మాజీ ప్రజాప్రతినిధి, ఐపీఎస్, సి ఐ మొదలైన పెద్దల అండ ఉండటంతో స్థానిక ఎస్సై కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. బాలిక పై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేసేవరకు కదిలేదే లేదని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.