తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు

తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు
  • ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు
  • తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇయ్యాలని గొడవ
  • నిరాకరించడంతో తల్లిపై సిలిండర్​తో దాడి
  • అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు
  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మున్సిపల్​ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు: నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి పాలిట కన్న కొడుకే కాల యముడయ్యిండు. ఆస్తి రాసివ్వలేదని అమ్మను గ్యాస్​సిలిండర్​తో కొట్టి చంపిండు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీలో జరిగింది. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 

సిద్ధాంతి గ్రామానికి చెందిన చంద్రకళ(55)కు ఇద్దరు కొడుకులు. 30 ఏండ్ల కింద భర్త చనిపోగా, ఆ తర్వాత పిల్లలను తీసుకుని వచ్చి రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీలో స్థిరపడింది. భర్త లేకపోయినా ఇద్దరు పిల్లలను అన్నీతానై పెంచింది. పెద్దకొడుకు ప్రకాశ్ కు పెండ్లి చేసింది. అప్పటి నుంచి చిన్నకొడుకు సదానందంతో చంద్రకళ ఉంటుండగా, ప్రకాశ్ తన​ భార్య, పిల్లలతో అదే బిల్డింగ్​లో పై ఫ్లోర్ లో ఉంటున్నాడు. 

కాగా, తాగుడుకు బానిసైన ప్రకాశ్​తరచూ తల్లితో గొడవ పడుతున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫుల్లుగా తాగొచ్చి, ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ చేశాడు. చంద్రకళ ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేశాడు. అనంతరం కిచెన్ లోకి లాక్కెళ్లి సిలిండర్ తో తలపై బాదాడు. చంద్రకళ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ప్రకాశ్​ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.