ప్రైవేట్ ​హాస్పిటల్​లో యువతి మృతి

  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
  • తమ తప్పేమీ లేదన్న డాక్టర్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​లో యువతి చనిపోగా, దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. హాజీపూర్ మండలం టీకనపల్లెకు చెందిన మేడం రమ్య(23)కు ఆదివారం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు మంచిర్యాలలోని ప్రసాద్ సర్జికల్ ల్యాప్రోస్కోపిక్ ​మెటర్నిటీ అండ్​కిడ్నీ సెంటర్​లో చేర్పించారు. డాక్టర్లు టెస్టులు చేసి రమ్య గర్భసంచికి గడ్డలు ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేశారు. బుధవారం ఉదయం తీవ్రమైన బ్లీడింగ్ అయ్యింది. అప్పటికే ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్​థియేటర్​కు తరలించారు. కార్డియాలజిస్టు వచ్చి ట్రీట్​మెంట్ అందిస్తుండగానే ఆమె చనిపోయింది. రమ్యకు ఆపరేషన్ చేసిన రెండు మూడు గంటల నుంచే బ్లీడింగ్​అయ్యిందని, ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పినా తెల్లవారే వరకు పట్టించుకోలేదని
కుటుంబసభ్యులు ఆరోపించారు.

సిబ్బంది, డాక్టర్​ నిర్లక్ష్యం వల్లే రమ్య చనిపోయిందని ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి న్యాయం జరి గేలా చూస్తామని చెప్పడంతో బాధిత కుటుంబం రమ్య డెడ్​బాడీని తీసుకెళ్లారు. అత్యవసరంగా ఆపరేషన్​ అవసరం లేదని చెప్పినప్పటికీ కుటుంబసభ్యులే  చేయాలన్నారని, గర్భసంచికి ఎలాంటి ప్రమాదం లేకుండా గడ్డలు తొలగించామని డాక్టర్​ ఆంజనేయ ప్రసాద్ ​మీడియాకు తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. ఆమె ఆందోళన చెందడం వల్లే ​కార్డియాక్​అరెస్టుతో చనిపోయిందని పేర్కొన్నారు.