భైంసా, వెలుగు : మిషన్‌భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా నిర్మల్ జిల్లా భైంసాలో ఓ యువకుడు చేయి కోల్పోయాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టౌన్‌లోని కిసాన్‌గల్లీకి చెందిన ఎం.సాయినాథ్(21) కొన్ని నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న తానూర్ మండలం హిప్నెలి తండాలోని సంపులో మోటార్ చెడిపోవడంతో రిపేర్ చేసేందుకు సాయినాథ్ వెళ్లాడు. కేబుల్జాయింట్చేసి టేపు చుడుతున్న క్రమంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా జరిగి సాయినాథ్ షాక్ కు గురయ్యాడు.
ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న వ్యక్తి సాయినాథ్‌ను కాపాడాడు. హుటాహుటిన భైంసాకు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు రిఫర్‌చేశారు. వెంటనే అక్కడికి తరలించి ఓ ప్రైవేట్హాస్పిటల్లో చేర్పించగా, డాక్టర్లు సాయినాథ్ కుడి చేయిని తొలగించారు. మిషన్‌భగీరథ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా కరెంట్సరఫరాను పునరుద్ధరించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ALSO READ:కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత
మిషన్ భగీరథ మండల సూపర్వైజర్తో పాటు ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయినాథ్ ది పేద కుటుంబం. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గోదావరి అన్నీతానై చూసుకోగా, మెకానిక్వృత్తి నేర్చుకున్న సాయినాథ్ కొంత కాలంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరెంట్‌షాక్‌తో సాయినాథ్ చేయి కోల్పోవడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం రూ.6 లక్షల వరకు చేశారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మిషన్‌భగీరథ అధికారులు తమకు న్యాయం చేయాలని యువకుడి తల్లి గోదావరి వేడుకుంటోంది.