కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగిత్యాలకు చెందిన అర్షద్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోయినా..తాము ఒకరికొకరం తోడుగా కలిసి జీవించాలని నిర్ణయించుకుని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. 

జగిత్యాలకు చెందిన అర్షద్..వీణవంకకు చెందిన ట్రాన్స్ జెండర్ దివ్య ప్రేమలో పడ్డాడు. అర్షద్ కోసం దివ్య సర్జరీ చేయించుకున్నారు. తమ పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు సపోర్ట్ చేయకపోయినా.. అర్షద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనతో జీవితాంతం తోడుగా ఉంటానని అర్హద్ చెప్పడంతో తన ప్రేమను కాదనలేకపోయానని దివ్య చెప్పారు. ఇంట్లో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత దైవ దర్శనం కోసం ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి జంటగా వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.