
- పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ప్రారంభం
- విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధం
- డీఎంహెచ్‌వోల నుంచి ఉద్యోగుల ఆధార్ వివరాల సేకరణ
- డుమ్మా కొట్టే ప్రభుత్వ డాక్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమయానికి డ్యూటీలకురాని, తరచూ డుమ్మాలుకొట్టే డాక్టర్లు, సిబ్బందికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్(అభాస్) ను తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తుంది.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీవీవీపీ(తెలంగాణ వైద్య విధాన పరిషత్), ఆయుష్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,870 ఆసుపత్రులున్నాయి. వాటిలో పనిచేసే 35 వేల మంది వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతిని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
మొదట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో వచ్చే ఆసుపత్రుల్లో ఈ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఆ తరువాత వైద్య విధాన పరిషత్తు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్.. మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని ఉపయోగిస్తున్నది. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు.
అటెండెన్స్ ఆధారంగానే జీతాలు
తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సహకారంతో అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డీఎంహెచ్‌వో(డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్) ల ద్వారా ఉద్యోగుల ఆధార్ వివరాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు సేకరిస్తున్నారు. డైరెక్టర్ఆఫ్ హెల్త్ లో 860 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టీవీవీపీ పరిధిలో 156, ఆయుష్ పరిధిలో 840 కేంద్రాల్లో అమలు చేయనున్నారు.
ఉద్యోగి ఆధార్ నెంబర్ ఆధారంగా ఐడీని కేటాయిస్తారు. ఐడీ ద్వారా ఉద్యోగి అటెండెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. హాజరు వివరాల ఆధారంగా జీతాలు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. అటెండెన్స్ వివరాలను మంత్రి, డీఎంఈ, డీహెచ్, సెక్రటరీ, కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు లాగిన్ చేసి వివరాలను పరిశీలించే వీలు ఉండేలా యాప్ ను రూపొందించారు. ఈ అటెండెన్స్విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది సమయానికి, రెగ్యులర్గా వస్తారని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగుపడుతాయని అధికారులు చెబుతున్నారు.
డాక్టర్లపై ఎన్నో ఫిర్యాదులు
ఇటీవలే మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ హాస్పిటల్ ను తనిఖీ చేశారు. అక్కడి రిజిస్టర్లను పరిశీలించి చాలా మంది డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించారు. మరికొంత మంది ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మా కొట్టారని నిర్ధారించారు. అలాగే.. జిల్లాల్లో సైతం కలెక్టర్లు ఇతర అధికారులు కూడా తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రధానంగా డాక్టర్లు, సిబ్బంది సమయానికి రాకపోవడం, డుమ్మాలు ఎక్కువగా కొడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో వాటికి చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంను తీసురావాలని మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఆసుపత్రుల్లో అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యతోనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.