సమ్మక్క- సారక్క జాతరకు మేడారం ముస్తాబైంది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ ఏడాది కూడా అంగరంగా వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తుంది.
మేడారం సమ్మక్క- సారక్క జాతర అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎత్తు బంగారమే.. ఇక్కడ బెల్లాన్ని ఎత్తు బంగారంతో పోల్చుతారు. భక్తులు ఎంతో భక్తి శ్రధ్ధలతో వచ్చి వనదేవతలైన అమ్మవార్లకు ఈ ఎత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో ఎత్తు బంగారాన్నికొనుగొలు చేసిన భక్తులు వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని ఎత్తు బంగారన్ని విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. బెల్లాన్ని బయట అమ్ముకుని... గుడుంబా తయారీకి ఉపయోగించే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిబంధనలు పెట్టారు. బెల్లాన్ని విక్రయించి గుడుంబా తయారీ ఉపయోగిస్తే లక్ష జరిమానా విధిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.