పుట్టుక నుంచి చావు వరకు ప్రతీ సర్టిఫికెట్ కోసం, ప్రతీ దరఖాస్తు కోసం ఆధార్ కార్డు అత్యంత తప్పనిసరి అని అంటుంటే.. ఒడిశా మాత్రం కొత్త దార్లో పయనిస్తోంది. వివిధ తరగతుల్లో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి కాదని ఒడిశా ప్రభుత్వం ఆగస్టు 7న స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేకపోయినా పాఠశాలల్లో అడ్మిషన్ పొందొచ్చని విద్యార్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు తమ పిల్లలను వివిధ తరగతుల్లో చేర్చుకోవడానికి ఆధార్ కార్డులను సమర్పించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రవేశాలు సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవో) రాసిన లేఖలో రాష్ట్ర పాఠశాల, సామూహిక విద్యాశాఖ కార్యదర్శి అశ్వతి ఎస్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: చంద్రయాన్ నుంచి చంద్రుడి ఫొటోలు.. పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి...
“ఈ సంవత్సరం అకడమిక్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కొన్ని పాఠశాలల్లో అవసరాన్ని బట్టి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. విద్యార్థుల అడ్మిషన్ ఎటువంటి అవాంతరాలు లేకుండా, సాఫీగా జరగాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లల అడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులకు అసౌకర్యం కలగకూడదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని అశ్వతి తెలిపారు.
ఆధార్ కార్డుతో లేదా లేకుండా కూడా పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకోవడానికి పిల్లలను తప్పనిసరిగా అనుమతించాలని పేర్కొన్న అశ్వతి.. సూచనలను కఠినంగా అమలు కావాలని లేదంటే తీవ్రంగా వ్యవహరిస్తామని చెప్పారు. అడ్మిషన్ తర్వాత జిల్లాలోని వివిధ కార్యాలయాలతో సమన్వయం చేసుకోవడం ద్వారా విద్యార్థులు ఆధార్ కార్డులు పొందే వెసులుబాటు కల్పించాలని కూడా అశ్వతి ఎస్ ఆదేశించారు.