ఓటరు నమోదుకు ఇకపై ఆధార్ కార్డు తప్పని సరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం ఫారం 6, 6బి లలో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటికే దాదాపు 66కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల కార్డుతో అనుసంధానం చేశామన్న ఎన్నికల సంఘం.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
- ALSO READ | కెనడియన్లకు వీసా సేవలపై భారత్ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఓటరు జాబితాలను ఖరారు చేసే ప్రక్రియలో ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను అప్‌లోడ్ చేసినట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2022 రూల్స్‌లోని రూల్ 26-బి ప్రకారం ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి కాదని.. “ఫారమ్‌లలో స్పష్టమైన మార్పుల” గురించి పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఎన్నికల ప్రయోజనం కోసం ఫారం-6 (కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం) మరియు ఫారం-6బి (ఆధార్ నంబర్ సమాచార లేఖ)లను సవరించాలని ECని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ తెలంగాణ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఓటర్ల ఆధార్ నంబర్లను సేకరించాలని EC తన అధికారులను పట్టుబట్టిందని, రాష్ట్ర అధికారులు గ్రామం, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.