
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందడానికి ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు కౌంటర్ సమర్పించింది. ఆధార్ కార్డుతో నిమిత్తం లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని వెల్లడించింది. ఆధార్ కార్డు లేనివారికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెం దిన బైరెడ్డి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై కౌంటరు దాఖలు చేశామని, ఉస్మానియా ఆస్పత్రిలో అదే రోజు పిటిషనర్ పేర్కొన్న మహిళతో పాటు మరో 100 మందికి ఆధార్ లేకుండా చికిత్స అందించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం ఆధార్ అవసరం లేదన్నారు. ఈ వాదనలను నమోదు చేసిన ధర్మాసనం.. పిటిషన్‌పై ఎలాంటి విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.