రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేష‌న్లు

  •  ఆధార్ నెట్​వ‌ర్కింగ్‌లో టెక్నికల్ ప్రాబ్లం
  • అమ్మకం, కొనుగోలుదారులకు ఇబ్బందులు
  • గురువారం నాటి రిజిస్ట్రేషన్లు..నేటికి వాయిదా

హైద‌రాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచినట్లు స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారులు తెలిపారు.. గురువారం మ‌ధ్యాహ్నం నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయ‌త్నిస్తున్నట్లు తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు గురువారం నిలిచిపోయాయి. యూడీఐఏ నెట్ వర్కింగ్‌లో తలెత్తిన సాంకేతిక కార‌ణాల‌తో ఈ సమస్య తలెత్తింది. దాంతో ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ త‌దిత‌ర సేవలు నిలిచిపోయాయి. ఆ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వీసులపైన ప‌డింది.  రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావ‌డంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 

అలా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూల్ చేశారు. ఆధార్​కు సంబంధించిన యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేష‌న్‌కు సంబంధించి సాంకేతిక స‌మ‌స్యగా చెబుతున్న అధికారులు, దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయ‌త్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రిజిస్ట్రేష‌న్ల కోసం వ‌చ్చిన వారు అనుకోకుండా ఎదురైన సాంకేతిక స‌మ‌స్యతో ఇబ్బందులకు గురయ్యారు. 

దీంతో సబ్ రిజిస్ట్రార్ల ఆఫీస్​ల దగ్గర క్రయ, విక్రయదారులు పడిగాపులు కాశారు. రిజిస్ట్రేషన్‌‌సేవలు నిలిచిపోవడంపై స్పందించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఢిల్లీలో కురుస్తున్న వర్షాల కారణంగా యూఐడీఏఐ నెట్ వర్కింగ్‌లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులతో ఈ సమస్య వచ్చిందని వివరించారు. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామన్న ఆయన, పెండింగ్‌ రిజిస్ట్రేషన్లను శుక్రవారం రీషెడ్యూల్‌ చేశామని స్పష్టం చేశారు.