
ఆధార్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సిమ్ కార్డు దగ్గర నుంచి పాస్ పోర్ట్ వరకు, ట్రైన్ టికెట్ దగ్గర నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ వరకు ఆధార్ తప్పనిసరి. అయితే.. ఆధార్ అప్ డేట్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్ లైన్ లో అప్డేట్ చేసుకునే అవగాహన లేకపోవడం.. అవగాహన ఉన్నప్పటికీ పోర్టల్స్ సరిగా పనిచేయకపోవడంతో జనాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కొన్ని రకాల అప్‌డేట్స్ కోసం హైదరాబాద్‌లోని ఆధార్ రీజినల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు.
ఏండ్లకేండ్లుగా తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్, ఫొటో మిస్ మ్యాచ్ లాంటి సమస్యలతోనే ఎక్కువ మంది వస్తున్నారు.
పిల్లల ఆధార్ అప్డేట్ కోసం తిప్పలు:
పిల్లలకు చిన్నప్పుడు ఆధార్ తీస్తే.. 5 నుంచి 15 ఏండ్ల లోపు వాళ్ల ఫింగర్ ప్రింట్స్ అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇది స్థానిక ఆధార్ సెంటర్లు, మీ సేవా సెంటర్లలో ఎక్కడైనా చేస్తారు. కానీ15 ఏండ్లు దాటితే మాత్రం లోకల్ సెంటర్లలో చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్లందరూ హైదరాబాద్‌లోని రీజినల్ సెంటర్‌కు తరలివస్తున్నారు.
సంవత్సరాల తరబడి తిరుగుతున్నా ఫలితం లేదు:
నాలుగైదు సార్లు అప్లై చేసిన..
నేను హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాను. నా ఫింగర్ ప్రింట్స్ మిస్ మ్యాచ్ అయ్యాయని 9 నెలల కింద ఇక్కడికి వచ్చి అప్లై చేశాను. పది రోజుల్లో అప్డేట్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చి అప్లై చేసినా సమస్య పరిష్కారం కాలేదు. వచ్చినప్పుడల్లా వారం, పది రోజులని చెబుతున్నారు. ఆధార్ అప్డేట్ కాకుంటే, నాకు స్కాలర్‌షిప్ రాదు. - సుష్మిత, ఖమ్మం జిల్లా
ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నం
నాకు ఇద్దరు పిల్లలు. ఆధార్ కార్డులో ఫొటోలు మిస్ మ్యాచ్ అయ్యాయి. నాలుగేండ్లుగా రీజినల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. వచ్చినప్పుడల్లా నెల, రెండు నెలలు అంటూ తిప్పుతున్నారు. ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నాం. - శ్రీనివాస్, భీమవరం, ఏపీ
రెండేండ్లుగా తిరుగుతున్నం:
మా పాప శ్లేషా రెడ్డికి మూడేండ్లు ఉన్నప్పుడు ఆధార్ తీసినం, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఆధార్ అప్డేట్ చేయిస్తే కావడం లేదు. ఫింగర్ ప్రింట్ మిస్ మ్యాచ్ అయ్యాయని లోకల్ సెంటర్లో చెప్పారు. రీజినల్ సెంటర్ కి వెళ్లాలని సూచించారు. రెండేండ్లుగా సెంటర్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. రిజెక్ట్ అయిన ప్రతిసారి మళ్లీ అప్లికేషన్ పెడుతున్నం. అసలు రిజెక్ట్ కావడానికి కారణమేంట్ చెప్పడం లేదు. అడిగితే నెలకు, రెండు నెలలకు రండి అంటున్నారు. కాలేజీలో పాప ఆధార్ ఇవ్వాల్సి ఉన్నది. ఏంచేయాలో అర్థం కావడం లేదు.
-జలంధర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా
ఫింగర్ ప్రింట్స్ రావట్లేదంటున్నరు:
నాకు ఇద్దరు కవల ఆడపిల్లలు. వాళ్లకు చిన్నప్పుడే ఆచార్ కార్డు తీసినం. రెండేండ్ల కింద నాభర్త చనిపోయారు. ఆయన విద్యుత్ శాఖలో పనిచేసేవారు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఆధార్ కార్డు అప్డేట్ వల్ల ఆగిపోయాయి. పిల్లల ఆధార్ అప్డేట్ కోసం వెళ్తే, ఒకరివి ఫింగర్ ప్రింట్స్ రావట్లేదని రిజెక్ట్ చేశారు..
-వరలక్ష్మి వనస్థలిపురం, హైదరాబాద్