రాహుల్, రేవంత్​ను తిట్టడమే మీ పనా?: కిషన్ రెడ్డి, బండి సంజయ్​పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

రాహుల్, రేవంత్​ను తిట్టడమే మీ పనా?: కిషన్ రెడ్డి, బండి సంజయ్​పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పనిగా పెట్టుకున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కులం, మతంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు.. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ మతం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కుల గణనను వ్యతిరేకించడమే బీజేపీ నేతల వైఖరిగా కనిపిస్తున్నదని, తెలంగాణ బీజేపీ నేతల తీరును బీసీలు అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దమ్ము, ధైర్యం ఉంటే  రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడని, ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా కావాల్సిన సీట్లు ఉన్నాయని, ఐదేండ్లపాటు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతున్నదన్నారు.