మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి(Srikanth n reddy) తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నాగవంశీ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(నవంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? వైష్ణవ్ తేజ్ కు హిట్టు పడిందా? కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఏమేరకు మెప్పించాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఆదికేశవ సినిమా కథ బ్రహ్మసముద్రం ఊరిలో ఉన్న శివాలయం చుట్టూ తిరుగుతుంది. చెంగారెడ్డి(జోజు జార్జ్) మైనింగ్ పేరుతో ఊళ్ళో మనుషులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. కొండలను తవ్వుకుంటూ.. ఊరిలో ఉన్న శివాలయం వరకు వస్తాడు. మైనింగ్ కి అడ్డుగా ఉందని ఆ గుడిని సైతం నేలమట్టం చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ గొడవలోకి బాలకోటయ్య అలియాస్ బాలు(వైష్ణవ్ తేజ్) ఎలా వచ్చాడు? బాలు రుద్రకాళేశ్వర రెడ్డిగా ఎలా మారాడు? ఆ ఊరిని, శివాలయాన్ని, అక్కడి ప్రజలను చెంగారెడ్డి బారి నుండి విడిపించాడా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
నిజానికి ఆదికేశవ సినిమా ఒక రొటీన్ కమర్షియల్, రివేంజ్ డ్రామా.. ఆ కథని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా ఉంది. సినిమాలో ప్రేమ, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు దర్శకుడు. అనుకున్న సింపుల్ కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. రొటీన్ స్టోరీనే అయినా.. ట్విస్టులకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి.
ఇంటర్వెల్ వరకు కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగినా.. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు నుండి నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది సినిమా. అక్కడి నుండి సినిమా పరుగులు పెడుతుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ పార్ట్ గురించి. వాటిని చాలా బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండే ఆ సీన్స్ కాస్త ఆడియన్స్ ని భయపెడతాయి. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మొదటి భాగం కాస్త ల్యాగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టుకు కంటిన్యూగా క్లైమాక్స్ లో వచ్చే మరో ట్విస్టు నెక్స్ట్ లెవల్లో వర్క్ అవుట్ అయ్యింది.
నటీనటులు:
ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అంటే వైష్ణవ్ తేజ్. తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. మాస్ ఎలిమెంట్స్ లో బాగా పెర్ఫర్మ్ చేశాడు. లవర్ బాయ్ గా.. మాస్ హీరోగా రెండు వేరియేషన్స్ ను సూపర్ గా పండించాడు. ఒకరకంగా సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. హీరోయిన్ శ్రీలీల తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ను అలరించింది. మళయాళ నటుడు జోజు జార్జ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ చెంగారెడ్డి పాత్రలో తన కంటిచూపుతో, మాటతో అద్భుతమైన నటనను కనబరిచాడు. హీరో తల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్, హీరో ఫ్రెండ్ గా సుదర్శన్, సుమన్, తనికెళ్ల భరణి, సదా, అపర్ణా దాస్ తమ పాత్ర మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
ఆదికేశవ సినిమాకి జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బీజీఎంతో సినిమాను పండించాడు. డడ్లీ కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తంగా ఆదికేశవ సినిమా గురించి చెప్పాలంటే.. రొటీన్ కథతో వచ్చిన సూపర్ ఎంటర్టైనర్. ఆడియన్స్ ఫులుగా ఎంజాయ్ చేస్తారు.